ఈ వారం ఓటీటీలో భారీ సినిమాల రాకతో మంచి సందడి కనిపించనుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ విజయాలను అందుకున్న సినిమాలు ఒకదాని తరువాత ఒకటి స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉన్నాయి. నాగ చైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను సాధించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, చైతూ కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ మూవీ ఈ నెల 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్‌గా సంచలనం సృష్టించిన ‘రేఖా’ సినిమా కూడా ఓటీటీలో సందడి చేయనుంది. జనవరి 9న విడుదలైన ఈ సినిమా కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో 75 కోట్ల వసూళ్లు రాబట్టడం హాట్ టాపిక్‌గా మారింది. అసిఫ్ అలీ – అనశ్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించగా, మమ్ముట్టి అతిథి పాత్రలో మెరిశారు. జోఫిన్ చాకో దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
తమిళంలో జనవరి 24న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కుడుంబస్థాన్’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. మణికందన్ – శాన్వి మేఘన జంటగా నటించిన ఈ సినిమా 8 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై, పాతిక కోట్ల వసూళ్లు రాబట్టి విజయాన్ని సాధించింది. వైశాఖ్ సంగీతం అందించిన ఈ సినిమా, ఫిబ్రవరి 7 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఇదే రోజున జియో హాట్‌స్టార్‌లో ‘బాపు’ సినిమా విడుదల కానుండగా, ఫిబ్రవరి 6న ఈటీవీ విన్‌లో ‘ధూం ధాం’ స్ట్రీమింగ్ కానుంది. ఈ వారం విడుదల కానున్న ఈ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఓటీటీ వినియోగదారులు మంచి కంటెంట్‌తో సందడి చేసే వారం కానుంది.
