ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, భారతదేశంలో తన మార్కెట్ ప్రవేశాన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవల ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై టెస్లాకు చెందిన సరికొత్త 2025 మోడల్ వై ఎలక్ట్రిక్ కారును భారీ క్యామోఫ్లాజ్‌తో టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా గుర్తించారు. ఈ పరిణామం టెస్లా కార్లు భారత్‌లోకి ప్రవేశించనున్నాయని స్పష్టంగా సూచిస్తోంది.
‘జూనిపర్’ మోడల్ – కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్
ఈ టెస్టింగ్‌లో కనిపించిన కారు, టెస్లా మోడల్ వై యొక్క తాజా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అని తెలుస్తోంది. దీన్ని ‘జూనిపర్’ అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు. ఈ అప్‌డేటెడ్ మోడల్ ఇప్పటికే అమెరికా, కెనడా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ డిజైన్, ఫీచర్లలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.
టెస్లా మోడల్ వై స్పెసిఫికేషన్స్
గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న అప్‌డేటెడ్ టెస్లా మోడల్ వై ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సెటప్‌తో వస్తోంది. ఇందులో లాంగ్-రేంజ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు, ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 526 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 4.6 సెకన్లలో 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫీచర్లలో 15.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 8-అంగుళాల స్క్రీన్, ADAS, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి.
భారతదేశంలో టెస్లా మోడల్ వై విడుదల
భారత్‌లో టెస్లా యొక్క కార్యకలాపాలు ఎప్పుడో ప్రారంభమవుతాయనే దానిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, మోడల్ వై యొక్క టెస్టింగ్ పరిణామాలు, ఇది భారత్‌లో విడుదలయ్యే తొలి టెస్లా కారు కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టెస్లా భారత్‌కు రావడంతో, ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని, వినియోగదారులకు మరిన్ని మెరుగైన ఆప్షన్లు లభిస్తాయని భావిస్తున్నారు.
