పవిత్ర గంగానది నీరు స్నానానికి పనికిరాదని బీహార్ కాలుష్య నియంత్రణ మండలి (BSPCB) తేల్చింది. రాష్ట్రంలోని 34 ప్రాంతాల్లో గంగానది నీటి నాణ్యతను రెండు వారాలపాటు పరీక్షించిన అనంతరం ఈ నివేదిక వెలువడింది. బీహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నదిలో అధిక స్థాయిలో బ్యాక్టీరియా కారణంగా స్నానానికి అనువుగా లేదని అధికారులు తెలిపారు.
గంగానది ఒడ్డున ఉన్న పట్టణాల నుంచి మురుగు నీరు నదిలో కలుస్తుండటమే ప్రధాన కారణమని సర్వే వెల్లడించింది. ఇళ్ల నుంచి వచ్చే కలుషిత నీరు నేరుగా గంగలో చేరుతుండటంతో నదిలో బ్యాక్టీరియా పెరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ నీరు వ్యవసాయం, చేపల పెంపకానికి మాత్రమే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పీహెచ్ స్థాయిలు, డిజాల్వ్‌డ్ ఆక్సిజన్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) పరిమిత స్థాయిలో ఉన్నాయని వివరించారు.
బీహార్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ శుక్లా మాట్లాడుతూ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలతో పోల్చినప్పుడు గంగానదిలో కొన్ని ప్రాంతాల్లో ఫీకల్ కోలిఫాం స్థాయి అత్యధికంగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, నదిలో కలిసే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగానది పవిత్రతకు భంగం కలుగకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలుష్య నివారణకు సమర్థమైన ప్రణాళికలు అమలు చేయాలని, పరిశుభ్రమైన గంగా కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
