ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, గోవిందప్ప లు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వారి వాదనను కోర్టు ఖండించింది. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోందని పేర్కొంటూ వెంటనే బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
గురువారం ఉదయం విచారణ చేపట్టిన ధర్మాసనం, “ఇప్పుడే నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు. హైకోర్టు విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేసు తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ నెల 5న మొదటి విడత విచారణ జరగగా, న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
ఈ కేసులో హైకోర్టు విచారణ కూడా కీలకంగా మారింది. ఈ నెల 7న హైకోర్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందస్తు నిర్ణయం తీసుకోనంటూ స్పష్టం చేసింది. దీంతో నిందితులు ఇక హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా సెన్సేషన్ అయ్యింది. వేల కోట్ల రూపాయల అవినీతి, అనేక కీలక రాజకీయ నేతల పేర్లు ఈ కేసులో చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పుడీ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు నిర్ణయం కేసుపై మరింత దృష్టిని కేంద్రీకరిస్తోంది.