వాలెంటైన్స్ డే సందర్భంగా తీహార్ జైల్లో ఉన్న ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ప్రేమలేఖ రాశాడు. గతంలో వీరిద్దరి సంబంధంపై పెద్ద చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తన ప్రేమను వ్యక్తం చేస్తూ సుఖేశ్ రాసిన లేఖలో, వచ్చే జన్మలో జాక్వెలిన్ హృదయంగా పుట్టాలని కోరుకున్నాడు.
‘‘హ్యాపీ వాలెంటైన్స్ డే బేబీ! ఈ ఏడాది మన జీవితంలో మంచి మార్పులు వస్తాయి. జీవితాంతం మనం కలిసి ఈ రోజును జరుపుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. నువ్వు అద్భుతమైన ప్రేయసివి. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నా ఒక్క కోరిక… వచ్చే జన్మలో నీ హృదయాన్నై పుడతాను,’’ అంటూ తన ప్రేమను చాటుకున్నాడు.
లేఖలో భాగంగా జాక్వెలిన్ కు విలువైన గిఫ్ట్ గా ప్రైవేట్ జెట్ అందజేస్తున్నట్లు సుఖేశ్ ప్రకటించాడు. ‘‘నీ కెరీర్ కారణంగా విదేశాలకు వెళ్తుంటావు. అందుకే నీకు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ జెట్ గిఫ్ట్ ఇస్తున్నా. ఆ విమానంపై నీ పేరులోని తొలి అక్షరాలు ముద్రించబడ్డాయి. రిజిస్ట్రేషన్ నంబరు నీ పుట్టినరోజును సూచిస్తుంది. ఈ జెట్ లో నువ్వు సౌకర్యంగా ప్రయాణిస్తావని ఆశిస్తున్నా’’ అని చెప్పాడు.
గతంలో సుఖేశ్, జాక్వెలిన్ కలిసి ఉన్న ఫొటోలు లీక్ కావడం సంచలనం రేపింది. కోర్టు విచారణలో జాక్వెలిన్ తన కెరీర్ నాశనానికి సుఖేశ్ కారణమని తెలిపింది. అతడి మోసాల కేసులో ఆమె వాంగ్మూలం ఇచ్చింది. అయినా సుఖేశ్ ఇప్పటికీ తన ప్రేమను వ్యక్తం చేస్తూ లేఖలు రాయడం చర్చనీయాంశమవుతోంది.