అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి పదవిలోకి వచ్చిన తర్వాత వలసదారులపై మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వీసా విధానాల్లో మార్పులు చేయడంతో పాటు, వలసదారులపై కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అమెరికాలో ఉండే విదేశీయులపై పూర్తి నిఘా పెట్టే విధంగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పనిచేస్తోంది.
ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం – సోషల్ మీడియాలో జాతి వ్యతిరేకతను ప్రేరేపించే పోస్టులు పెడితే వారికి వీసాలు, గ్రీన్‌కార్డులు మంజూరు చేయబోమని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల నుంచి స్థిర నివాస దరఖాస్తుదారుల వరకు అందరికీ ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఇప్పటికే 300 మందికి వీసాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ విషయంపై హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నొయెమ్ మాట్లాడుతూ – అమెరికా వచ్చి ఉగ్రవాదాన్ని సమర్థించేలా లేదా యూదులపై వ్యతిరేకతను ప్రేరేపించేలా వ్యవహరించిన వారిని సహించబోమని హెచ్చరించారు. ఇలాంటివి చేయాలని అనుకునేవారు ముందుగా రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.
అంతేకాకుండా హమాస్, హెజ్బొల్లా, పీఐజే వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఎలాంటి పోస్టులు పెట్టినా తక్షణమే చర్యలు తీసుకుంటామని విదేశాంగ కార్యదర్శి మార్కూ రూబియో తెలిపారు. ఈ విధంగా విదేశీయులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తీకరించే ముందు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.