తిరుపతి పట్టణంలో స్పోర్ట్స్ బైక్‌లతో ప్రమాదకర స్టంట్స్ మరియు రేసులపై పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎస్పీ శ్రీ యల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, డి.యస్.పి జే. వెంకటనారాయణ నేతృత్వంలో ఎస్.వి.యు పి.యస్ సి.ఐ యం. రామయ్య ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపారు. ఫ్లై ఓవర్ రోడ్లు, జూపార్క్ రోడ్డుల్లో రేసులు నిర్వహిస్తూ, Instagram మరియు WhatsApp లో వీడియోలు పోస్ట్ చేసే వారిపై నిఘా ఉంచి, 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బైక్‌లకు సంబంధిత యజమానులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేసి, RTOకి నివేదించారు. ఇటువంటి ప్రమాదకర చర్యల ద్వారా యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, రహదారి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరించారు.
తిరుపతి పట్టణంలో ఇక నుంచి రహదారులు, ఫ్లై ఓవర్లు, మరియు ఇతర ప్రధాన ప్రాంతాల్లో స్పోర్ట్స్ బైక్‌లు వినియోగిస్తూ శబ్ద కాలుష్యం సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై BNS చట్టం మరియు మోటారు వాహనాల చట్టం ప్రకారం శిక్షలు విధించబడతాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ చేయాలని, విద్యార్థులు రహదారులపై ప్రాణాలకు ముప్పు కలిగించే విన్యాసాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా నిబంధనలు పాటిస్తూ యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలని పోలీసు అధికారులు కోరారు.