గోవా రాష్ట్రంలోని షిర్గావ్ గ్రామంలో ఉన్న ప్రసిద్ధ లైరాయి దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామున జరిగిన వార్షిక జాతర విషాదంలో ముగిసింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్న ఉత్సవాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని 6 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో 17 ఏళ్ల యువకుడు ఉండటం మరింత కలచివేస్తోంది. ఏటా ఏప్రిల్ లేదా మే నెలల్లో జరిగే ఈ జాతర కోసం గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం తెల్లవారుజామున 4:30 సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తుల మధ్య ఒక్కసారిగా భయాందోళన రేగడంతో తోపులాట మొదలైంది. ‘అగ్నిదివ్య’ అనే ఆచారం జరుగుతున్న సమయంలో ఆ విధంగా అయిందా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రాథమికంగా అధిక రద్దీ, క్రమశిక్షణ లోపమే కారణమని అధికారులు భావిస్తున్నారు. అయితే సీఎం ప్రమోద్ సావంత్ విద్యుత్ షాక్ వల్ల గందరగోళం ఏర్పడిందని అనుమానిస్తున్నారు.
ప్రమాదం తలెత్తిన వెంటనే పోలీసులు, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని గోవా మెడికల్ కాలేజీతో పాటు ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం ప్రమోద్ సావంత్ ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించి, రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరులతో సహాయంగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గోవా ఆరోగ్యశాఖ 24/7 హెల్ప్‌లైన్ ప్రారంభించింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కూడా దుర్ఘటన జరగడం విచారకరమని అధికారులు పేర్కొన్నారు. పోలీసు దళాలు, డ్రోన్లు, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంలో ఉన్నప్పటికీ ప్రమాదం ఎలా సంభవించిందన్నదానిపై విచారణ కొనసాగుతోంది.
