ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని, శ్రీసిటీ ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అటవీ శాఖకు ₹10 లక్షలు విరాళంగా అందించింది. ఈ విరాళం నేలపట్టు పక్షుల అభయారణ్యంలో మౌళిక సదుపాయాల కల్పన, సందర్శకుల వసతుల పెంపుకు తోడ్పడనుంది. సోమవారం సూళ్లూరుపేట డీఎఫ్‌వో హారిక, ఇతర అటవీ అధికారుల సమక్షంలో శ్రీసిటీ ఫౌండేషన్ డైరెక్టర్ (సీఎస్‌ఆర్) నిరీషా సన్నారెడ్డి చెక్కును తిరుపతి సర్కిల్ ఫారెస్ట్ కన్సర్వేటర్ సి.సెల్వంకు అందజేశారు.
పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రీసిటీ ఫౌండేషన్ కట్టుబాటును తెలియజేస్తూ, సంస్థ తరఫున కోటి విరాళాన్ని అందించాలనే లక్ష్యంలో భాగంగా తొలిదశగా ఈ విరాళం అందించినట్లు నిరీషా తెలిపారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయాలని కోరారు. పారిశ్రామిక వృద్ధి సుస్థిరతతో సాగాలని, ప్రకృతి పరిరక్షణకు మద్దతుగా ఉండాలని సూచించారు.
ఈ విరాళం పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుకు మద్దతుగా నిలుస్తుందని సెల్వం తెలిపారు. శ్రీసిటీ ఫౌండేషన్ నిరంతర మద్దతును ప్రశంసిస్తూ, సీఎస్‌ఆర్ లో భాగంగా విరాళం అందచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సహాయంతో నేలపట్టు అభయారణ్యంలో పర్యాటక వసతుల విస్తరణ, పక్షుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. శ్రీసిటీ పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఈ కార్యక్రమం మరోసారి రుజువు చేస్తుందని అన్నారు.