ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు పర్యటనలో పాల్గొననున్న నేపథ్యంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఎం. సూర్య తేజ ఐఏఎస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్”లో భాగంగా ఈ కార్యక్రమం జరుగనుంది. శుక్రవారం ప్రత్యేకంగా పర్యటన ఏర్పాట్లను కమిషనర్ సమీక్షించారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ పనులు, సివిల్ వర్క్స్, జంగల్ క్లియరెన్స్, ఇతర ఏర్పాట్లను కమిషనర్ పర్యవేక్షించారు. మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛతకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఏ.ఎమ్.సి మార్కెట్ యార్డు మైదానంలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై కమిషనర్ ప్రత్యేక అధికారులతో సమావేశమయ్యారు. సభలో స్టాల్స్, వీఐపీ లాంజ్, ఇతర వసతుల ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులతో చర్చించి సభ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
దూబగుంట గ్రామ ప్రజాపార్కులో ముఖ్యమంత్రి విద్యార్థులతో మమేకమయ్యే కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు పెయింటింగ్, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని విభాగాల అధికారులు సమిష్టిగా పని చేయాలని స్పెషల్ ఆఫీసర్ సూచించారు.

 
				 
				
			 
				
			 
				
			