తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ ప్రచారంలో ఉన్న వార్తలపై నటుడు సోనూ సూద్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిన ఆయన, ఈ వార్తలు పూర్తిగా అబద్ధమని, తనకు ఎలాంటి సంబంధం లేని విషయాన్ని కావాలనే హైప్ చేస్తున్నారని ఆరోపించారు. మీడియా వర్గాలు నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం బాధాకరమని తెలిపారు.
సోనూ సూద్ మాట్లాడుతూ, “నాకు ఎటువంటి సంబంధం లేని మూడవ పక్షానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం నన్ను సాక్షిగా పిలిచింది. మా న్యాయవాదులు ఈ అంశంపై స్పందించారు. నా పేరును కావాలనే టార్గెట్ చేస్తూ పబ్లిసిటీ కోసం వాడుతున్నారు” అని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదే విషయంపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకాల ప్రచారం జరుగుతోంది. పంజాబ్‌లోని లుధియానా కోర్టు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఆయన న్యాయవాదులు ఈ కేసుకు తమ క్లారిఫికేషన్ ఇచ్చారని వెల్లడించారు.
తన సేవా కార్యక్రమాల కారణంగా తనపై కావాలనే అప్రచారం చేస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని సోనూ సూద్ స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాంటి వివాదాల్లో తన పేరు లాగడం చూసామని, ఇకపై తాను కఠినంగా స్పందిస్తానని హెచ్చరించారు.
