నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. 17 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా, ఇప్పటివరకు మూడు మృతదేహాలను గుర్తించారు.
నిన్న తొలిమృతదేహాన్ని వెలికితీసిన రెస్క్యూ బృందం, నేడు మరో రెండు మృతదేహాలను గుర్తించింది. బోరింగ్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మొదట గుర్తించగా, అదే ప్రదేశంలో మరో ఇద్దరి మృతదేహాల ఆనవాళ్లు కనిపించాయి. వీటిని వెలికితీయేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.
కేరళ నుంచి ప్రత్యేకంగా కడావర్ డాగ్స్‌ను తీసుకువచ్చిన తర్వాత సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ఈ శునకాలు 15 అడుగుల లోతులో ఉన్న మృతదేహాల స్థానాన్ని గుర్తించగల సామర్థ్యం కలిగినవిగా అధికారులు తెలిపారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగంగా కొనసాగుతోంది.
ఇతర మృతదేహాల కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సహాయక చర్యలను త్వరగా పూర్తి చేసి మిగిలిన మృతదేహాలను వెలికితీయడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది.
