మెల్‌బోర్న్ టెస్టులో విరాట్ కోహ్లీ మరోసారి తన ఫామ్‌ను నిరూపించుకోలేకపోయాడు. 340 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 184 పరుగుల తేడాతో ఓడిపోయింది. కీలకమైన ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ కేవలం 5 పరుగులకే ఔటయ్యాడు. పెర్త్ టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ ఆ తరువాతి ఇన్నింగ్స్‌లలో విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఆర్సీబీ మాజీ కోచ్ సైమన్ కటిచ్ కోహ్లీ ఫామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. “ది కింగ్ ఈజ్ డెడ్” అంటూ కోహ్లీ బ్యాటింగ్‌ను తీవ్రంగా విమర్శించాడు. అతడి ఆత్మవిశ్వాసం తగ్గిందని, జట్టులో బుమ్రా ఇప్పుడు ప్రధాన వ్యక్తిగా నిలిచాడని అభిప్రాయపడ్డాడు. ఇది కోహ్లీకి పెద్ద ఎదురుదెబ్బగా మారిందని కటిచ్ అన్నాడు.
ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 12.83 సగటుతో ఇప్పటివరకు 30 వికెట్లు తీసిన బుమ్రా భారత జట్టులో ప్రధాన బౌలర్‌గా నిలిచాడు. 44 టెస్టుల కెరీర్‌లో 203 వికెట్లు సాధించిన బుమ్రా తన ఫామ్‌తో అందరినీ మెప్పిస్తున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కీలకమైన చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది. ఈ టెస్టులో భారత జట్టు కోహ్లీ ఆటతీరుపై ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది. కోహ్లీ తన ఫామ్‌ను తిరిగి పొందుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.