ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కేంద్రం పాత్ర, నిధుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రమైన విమర్శలు చేశారు. విభజన చట్టం 94(3) ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదని గుర్తుచేస్తూ, మోదీ తన హామీలను నిలబెట్టుకోలేదని ఆమె ఆరోపించారు.
“2015లో మట్టి కొట్టి, ఇప్పుడు మాటలు కొడుతున్నారు” అంటూ షర్మిల మండిపడ్డారు. అప్పట్లో అద్భుత అభివృద్ధి చేస్తామన్న మాటలు అన్నీ వదంతులే అయిపోయాయని, మళ్లీ అదే మోసాన్ని బీజేపీ పునరావృతం చేస్తున్నదని విమర్శించారు. “5 కోట్ల ప్రజల కలల అమరావతి భవనం అసలు ప్రారంభం కూడా కాలేదు. నిధులేమీ ఇవ్వకుండా, సున్నా గరిష్ఠంగా మోసం చేశారని” ఆమె విమర్శించారు.
షర్మిల చంద్రబాబుపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది, జీతాలకే డబ్బుల్లేవంటారు, కానీ అమరావతికి మాత్రం వేల కోట్ల అప్పులు తెస్తున్నారు. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి, భవిష్యత్ తరాలపై అప్పుల భారం మోపుతున్నారు. ఇది ప్రజలకు, రాష్ట్రానికి జరిగిన అతి పెద్ద అన్యాయం” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం మెడలు వంచే ధైర్యం లేకపోతే, ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టే హక్కు చంద్రబాబుకేదంటూ షర్మిల ప్రశ్నించారు. ADB, వరల్డ్ బ్యాంక్, KFW లాంటి సంస్థల దగ్గర అప్పులు తెచ్చేందుకు రాజధాని పేరుతో ప్రజాస్వామ్యాన్ని బలిగొడుతున్నారని పేర్కొన్నారు. అమరావతి విషయంలో చట్టబద్ధత, నిధులు, హామీలపై స్పష్టత లేదని ఆమె అన్నారు.
