పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌లోని పాకిస్థాన్ జాతీయులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వారి వీసాలను రద్దు చేస్తూ, దేశం విడిచి వెళ్లాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, శ్రీనగర్‌కు చెందిన అహ్మద్ తారిక్ భట్ కుటుంబం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశం విడిచి వెళ్లకుండా తాత్కాలిక ఊరటనివ్వాలని వారు కోరారు.
ఈ కుటుంబంలో ఆరుగురు సభ్యులుండగా, వారిలో కొందరికి ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు ఉన్నాయని వారి న్యాయవాది నంద కిశోర్ కోర్టుకు తెలిపారు. ఒకరైనా పాకిస్థాన్‌లో జన్మించినప్పటికీ, తర్వాత భారత పౌరసత్వం తీసుకుని పాక్ పాస్‌పోర్ట్‌ను అధికారులకు అప్పగించారని వివరించారు. కానీ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వారు దేశంలో ఉండటాన్ని గుర్తించిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు.
వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం, పిటిషన్‌లో కొంత లోపం ఉన్నప్పటికీ, పిటిషనర్ల ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి తాత్కాలిక ఊరటనిచ్చింది. కేసులో తుది నిర్ణయం తీసుకునే వరకు వారిపై బలవంతపు చర్యలు తీసుకోరాదని అధికారులను ఆదేశించింది. కుటుంబం సమర్పించిన పత్రాలను పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
అలాగే, అవసరమైతే పిటిషనర్లు జమ్ముకశ్మీర్ హైకోర్టును సంప్రదించవచ్చని సూచించింది. ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించాలే గానీ, ఇది ఇతరులకు ఉదాహరణగా ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వ్యవహారంలో అధికారులను సంప్రదించడం సరైన మార్గమని సూచించారు.