కుప్పం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో సంగీత అనే మహిళ తన ప్రేమించిన శ్రీనివాస్ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రేమించిన వ్యక్తి నమ్మించి మోసం చేశాడని, పోలీసులే తనకు న్యాయం చేయాలని ఆమె వాపోయింది. న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది.
సంగీత తన వివాహానికి ముందు శ్రీనివాస్‌ను ప్రేమించిందని, కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో వేరొకరిని వివాహం చేసుకుని బెంగళూరులో జీవనం సాగించిందని తెలిపింది. అయితే ఈ విషయం తన భర్తకు తెలిసి అతను విడాకులు ఇచ్చేశాడని చెప్పింది. ఈ పరిస్థితుల్లో తనను ప్రేమించిన శ్రీనివాస్ తనను చేరదీసి తొమ్మిదేళ్లుగా కలిసే ఉన్నాడని ఆరోపించింది.
ఇప్పుడేమో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అతనికి వేరొక వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ కారణంగా తనను వదిలించుకోవాలని చూస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంపై రెండునెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని వాపోయింది.
తన భర్తను విడిచి, విడాకులు తీసుకుని వచ్చాక శ్రీనివాస్ వివాహం చేసుకుంటానని నమ్మబలికాడని, కానీ ఇప్పుడు తనను కలిసేందుకు కూడా ప్రయత్నించడం లేదని పేర్కొంది. తన కుటుంబ సభ్యులు కూడా తనను చేరదీయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పూర్తిగా మోసపోయానని, తగిన న్యాయం చేయాలని పోలీసులను కోరింది.