అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి (సమనస) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అభివృద్ధి చేసిన మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్లర్ ప్రాజెక్టు జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. ఈ ప్రాజెక్టు విద్యార్థుల ఆవిష్కరణ నైపుణ్యాన్ని చాటిచెప్పడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను రుజువు చేసింది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని, సమనస గ్రామ పంచాయతీ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్, ఉప సర్పంచ్ మామిళ్లపల్లి దొరబాబు, పరమట భీమ మహేష్ చేతుల మీదుగా విజేతలైన పి. రోహిణి, ఎస్. శశివదన్ లను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల నైపుణ్యం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
సన్మాన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగ సత్యనారాయణ, చైర్మన్ ముత్యాల బాబు, గైడ్ టీచర్ ప్రకాష్, ఉపాధ్యాయులు రాజేశ్వరి, బడుగు సత్యనారాయణ, గణేష్, సత్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాధనపై పాఠశాల ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపించారు.
గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవార్డు గర్వకారణంగా భావించారు. ఇలాంటి ప్రాజెక్టులు మరింత ప్రోత్సాహం పొందాలని, గ్రామీణ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. విద్యార్థుల ఈ ప్రతిభ రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందేలా అధికారుల దృష్టి సారించాలని సమనస గ్రామ పెద్దలు సూచించారు.

 
				 
				
			 
				
			 
				
			