ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు ఆశించిన విధంగా రాణించలేకపోతోంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. వరుస పరాజయాలతో అభిమానుల్లో నిరాశ అలుముకుంది. ముఖ్యంగా గెలుపు తలుపుల వద్దకు వచ్చి ఓటమి పాలవుతున్న తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులే అవసరమవుతుండగా ఆర్ఆర్ పూర్తిగా తడబడింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లి అక్కడ ఓటమి చెందింది. ఆ తరువాత లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహా పరిస్థితి మళ్లీ ఏర్పడింది. చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు అవసరమై రెండు పరుగుల తేడాతో ఓడిపోవడం జట్టుపై విమర్శలకు తావిచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ఆర్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు వెలువడుతున్నాయి. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అడ్ హాక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక జట్టు గెలుపు దాదాపుగా ఖరారు అయ్యే పరిస్థితుల్లో ఇలా వరుసగా మ్యాచ్‌లు కోల్పోవడం అనుమానాస్పదమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. చివరి ఓవర్లలో జరిగిన పరిణామాలు చూస్తే ఫిక్సింగ్ అనే అనుమానం సహజమని వ్యాఖ్యానించారు. బిహానీ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఈ ఆరోపణలతో ఐపీఎల్‌లో నైతికతపై మళ్లీ చర్చ మొదలైంది.
