జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం జరిగిన విషయం బయటకు రావడంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డిప్యూటీ సీఎం పవన్‌కు ధైర్యం చెప్పడమేగాక, ఆ కుటుంబానికి మానవీయంగా మద్దతు తెలపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఇదంతా జరుగుతుండగానే, రోజా విజయవాడలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఒక రాయలసీమ మంత్రిని కలిసారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ భేటీ వెనుక ఆమెకి ఉన్న ఉద్దేశం ఏమిటన్నదానిపై వివిధ కోణాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై అవినీతికి సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండటంతో రోజా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని సమాచారం.
లోకేష్ చేపట్టిన రెడ్ బుక్ పై వైసీపీ నేతలు స్పష్టంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక వ్యవహారాలపై కేసులు తిరగబడుతున్నాయి. దీంతో రాజీ చర్చల కోణంలో రోజా ఆ మంత్రిని కలిసినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ భేటీకి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ రాజకీయంగా ఇది పెద్ద చర్చకే దారితీసింది.
తాజా కాలంలో రోజా వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముందెప్పటిలా ఘాటు వ్యాఖ్యలు చేయడం తగ్గించుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో మౌనంగా ఉన్నా, మహిళలపై వ్యవహారంలో మాత్రం స్పందించారు. మళ్లీ ఇప్పుడు నిశ్శబ్దానికి జారారు. రాబోయే రోజుల్లో ఈ దౌత్య రాజకీయాలకు ఏం ఫలితం వస్తుందో వేచి చూడాలి.