భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డులను అందుకునే అవకాశంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 268 వన్డేల్లో 10,988 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. ఈరోజు మ్యాచ్‌లో 12 పరుగులు చేస్తే 11,000 పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో భారత ఆటగాడిగా నిలుస్తాడు. అంతేకాదు, విరాట్ కోహ్లీ తర్వాత అతి వేగంగా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కనున్నాడు.
రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే, బంగ్లాదేశ్‌పై వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా అవతరిస్తాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు సాధించిన మూడో భారత ఆటగాడిగా, ప్రపంచవ్యాప్తంగా 10వ ప్లేయర్‌గా నిలుస్తాడు. ప్రస్తుత జాబితాలో సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లీ (81) ముందు వరుసలో ఉన్నారు.
కెప్టెన్సీ విభాగంలోనూ రోహిత్ శర్మ కొత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్లో 100 విజయాలు సాధించిన నాలుగో భారత కెప్టెన్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు మహ్మద్ అజారుద్దీన్ (104), విరాట్ కోహ్లీ (137), ఎంఎస్ ధోనీ (179) మాత్రమే ఈ ఘనత సాధించారు.
అంతేకాదు, ఈ మ్యాచ్‌లో 14 సిక్సర్లు బాదితే వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుత జాబితాలో షాహిద్ అఫ్రిదీ (351) అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 338 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఈ రికార్డులను అందుకునే అవకాశం ఉండటంతో రోహిత్ ప్రదర్శనపై అభిమానుల దృష్టి పెరిగింది.