తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మార్చి నెల మధ్యలోనే రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగు జిల్లాల్లో 41 డిగ్రీలకు చేరువయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉండగా, నిర్మల్ జిల్లా లింగాపూర్‌లో అత్యధికంగా 40.7°C రికార్డైంది.
ఆదిలాబాద్ జిల్లా బేల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 40.6°C, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 40.5°C నమోదు అయ్యాయి. మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 40.4°C, జగిత్యాల, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో 40.3°C, జయశంకర్ భూపాలపల్లిలో 40.2°C, కామారెడ్డి, ఖమ్మంలో 40.1°C, హనుమకొండ, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 40°C నమోదైంది.
పగటి వేడితోపాటు రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో రాత్రి 21.8°C, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 20°C నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 16.8°C నుంచి 19°C మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలుల ప్రభావంతో మరిన్ని రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.
రెండు రోజులపాటు రాష్ట్రంలోని 18 జిల్లాలకు తెలంగాణ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (TGDPAS) హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

 
				 
				
			 
				
			 
				