కోవూరు నియోజకవర్గంలో సాగునీటి కాలువలకు పూర్వ వైభవం తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా టిడిపి సీనియర్ నాయకులు ఏటూరి శివరామకృష్ణారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, మల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కోవూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సాగునీటి డిస్ట్రిబ్యూటరీ ఎన్నికల అనంతరం వారు మాట్లాడుతూ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే సమయం వచ్చిందని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుల సమస్యలపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల సాగునీటి కాలువలు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. ఈ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సాగునీటి సంఘాల అధికారం రైతులే కావడం గర్వకారణమని, వారి ద్వారా కాలువల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజాగా ఎన్నికైన సాగునీటి సంఘాల సభ్యులు సదరన్ ఛానల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీలపై గొప్ప బాధ్యత వహిస్తున్నారని నాయకులు చెప్పారు. రైతుల అవసరాలను సమర్థవంతంగా నెరవేర్చడంలో వీరు కీలక పాత్ర పోషించాలని, సాగునీటి కాలువలు పునరుద్ధరణకు కృషి చేయాలని సూచించారు.
రానున్న రోజుల్లో కోవూరు నియోజకవర్గానికి మహర్దశ రానుందని, సాగునీటి కాలువలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని టిడిపి నాయకులు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చర్యలు రైతుల జీవితాల్లో పెద్ద మార్పునకు దోహదం చేస్తాయని, వ్యవసాయానికి నూతన ఉత్సాహం తీసుకురాగలవని అభిప్రాయం వ్యక్తం చేశారు.
