ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్‌లలో ఎంఐజీ లేఅవుట్లను కొనుగోలు చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫీజులో భారీగా తగ్గింపు ప్రకటిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యతరగతి వర్గాలపై 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు భారంగా మారడంతో, కొనుగోలుదారులు ఆందోళన చెందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నూతన విధానం ప్రకారం ప్లాట్ మొత్తం విలువను రెండు భాగాలుగా విభజించారు. బేస్ ప్రైస్‌కు గాను 60 శాతం మొత్తంపై 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. మిగిలిన 40 శాతం అభివృద్ధి ఛార్జీల కింద పరిగణించి, దానిపై కేవలం 0.5 శాతం మాత్రమే ఫీజు విధించనున్నారు. ఈ విధానం అమలుతో మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.
రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (CRDA), విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMDA) పరిధిలో ఇప్పటికే ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయగా, లాటరీ ద్వారా అనేక మంది మిడిల్ క్లాస్ కుటుంబాలకు ప్లాట్లు కేటాయించబడ్డాయి. వారు దీర్ఘకాలంగా రిజిస్ట్రేషన్ వ్యయంపై ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వారికి గణనీయమైన ఊరట లభించింది. తమ కలల ఇంటిని నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావం చూపనుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఇతర శాఖలు కూడా ప్రజా అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
