ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే చర్యల్లో భాగంగా, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ అటవీ శాఖ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం, ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి తీసుకోవలసిన కఠిన చర్యలపై దృష్టి సారించింది. పెంచలకోన, సోమశిల, లంకమల అటవీ ప్రాంతాల్లో పర్యటించి, ఈ ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయాలని సూచించారు.
ఈ సమావేశం సందర్బంగా, ఎర్రచందనం స్మగ్లర్లు తమ అక్రమ రవాణా కోసం ఉపయోగించే ఎంట్రీ, ఎగ్జిట్, లోడింగ్ పాయింట్ల వద్ద కఠిన నిఘా విధానాలు అమలు చేయాలని స్పష్టం చేశారు. అటవీ శాఖ చెక్ పోస్టులలో సిబ్బంది కొరత లేకుండా, వారిని సమర్థవంతంగా పనిచేయించేలా తగిన మౌలిక సదుపాయాలతో సన్నద్ధం చేయాలని తెలిపారు.
భవిష్యత్తులో టాస్క్ ఫోర్స్ అటవీ శాఖతో కలసి ప్రత్యేక మాస్ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఈ ఆపరేషన్ల ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
సంవత్సరాలపాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన పాత నేరస్తులపై సాంకేతిక పద్ధతుల ద్వారా నిఘా ఉంచాలని, అలాంటి నేరస్తులు తిరిగి నేరాలకు పాల్పడితే, పీడీ యాక్ట్ ప్రయోగం చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.
