ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో బుధవారం జరిగిన విషాద ఘటన మానవీయ సంఘటనగా మారింది. క్యాన్సర్ బారిన పడి, తిరిగి కోలుకునే ఆశ లేకపోవడంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్యను కాల్చిచంపి, తానే తనువు చాలించాడు. కుటుంబంలో విషాదం నెలకొన్నది.
ఘజియాబాద్ సిటీకి చెందిన కుల్ దీప్ త్యాగి (46) ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. వైద్యుల ప్రకారం చికిత్సకు భారీ ఖర్చు అవసరమవుతుందని, కోలుకునే అవకాశం తక్కువేనని చెప్పడంతో త్యాగి మానసికంగా కుంగిపోయాడు. చివరికి జీవితం మీద ఆశ కోల్పోయి, తాను మాత్రమే కాక భార్యను కూడా ఈ లోకం నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించాడు.
ఇంట్లో లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకొని మొదటగా భార్య అన్షును కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయాడు. సూసైడ్ లెటర్‌లో తన ఇద్దరు కొడుకులకు తప్పులేదు అని, ఈ నిర్ణయం పూర్తిగా తనదే అని స్పష్టంగా పేర్కొన్నాడు. క్యాన్సర్ బాధలతో భవిష్యత్తు లేకుండా పోయిందని అందులో రాశాడు.
తల్లిదండ్రుల గదిలోంచి కాల్పుల శబ్దం విన్న కుమారులు అక్కడికి పరుగెత్తి వెళ్లగా, వారు ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
