కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన రికార్డుల తనిఖీ కూడా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ, కోసిగి, కౌతాళం పోలీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులను గమనిస్తూ, పోలీసులు నేరాల నియంత్రణలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. స్టేషన్ సిబ్బందికి మరింత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఈ ప్రాంతంలో గతంతో పోల్చితే ఫ్యాక్షన్ వేళ్లు తగ్గాయని డీఐజీ వెల్లడించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండి, భవిష్యత్తు తరం కోసం పిల్లలను మంచి చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం శాంతి, భద్రతలు ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు మంజునాథ్, అశోక్ కుమార్, ఎస్సైలు చంద్రమోహన్, నిరంజన్ రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
