అయోధ్య రామమందిరం శిఖరంపై 42 అడుగుల పొడవుగల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం అక్షయ తృతీయ సందర్భంగా విజయవంతంగా పూర్తయింది. ఈ వేడుకకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపారు.
వైశాఖ శుక్లపక్ష ద్వితీయ ముహూర్తంలో, ఉదయం 8 గంటలకు ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారని ఆయన పేర్కొన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఎంతో పవిత్రమైన ఈ సమయంలో జరిగిన ప్రతిష్ఠ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక తృప్తిని కలిగించిందని చెప్పారు.
చంపత్ రాయ్ మాట్లాడుతూ, రామమందిర నిర్మాణంలో భాగంగా ఏడు మండపాల నిర్మాణం తుదిదశకు చేరిందని తెలిపారు. భవన నిర్మాణంతోపాటు శిల్పకళా ప్రాముఖ్యతను పాటిస్తూ పనులు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే ఈ మండపాల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
రామ మందిరంలోని రామ్ దర్బార్ విభాగంలో ఉంచాల్సిన విగ్రహాలు మే నెలలో ఏర్పాటయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ట్రస్ట్ వెల్లడించింది.
