దేశానికి అన్నం పెట్టే రైతన్న తమ హక్కుల కోసం ఆందోళన చేసుకుంటున్న పరిస్థితి కలిగినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ ప్రశ్నించారు. మంగళవారం రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించి, ‘అభివృద్ధి చెందుతున్న భారతదేశం కోసం కలలు కనడం కాకుండా దానిని లక్ష్యంగా నిర్ణయించి ముందుకు సాగడం ఇదే మొదటిసారిగా చూస్తున్నా. దేశం ఉన్నత శిఖరాలవైపు పయనిస్తోంది. అయితే, రైతులు మాత్రం ఆందోళన చేస్తున్నారని’ అన్నారు.
రైతులు రోడ్లపైకి వెళ్లి తమ అసహనం వ్యక్తం చేస్తున్నారని, దేశంలో రైతు మాత్రమే అసహాయుడిగా మిగిలిపోతున్నాడని ధన్ ఖడ్ పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు ఏమి జరుగుతోంది? రైతుల హక్కులకు సంబంధించి ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు?’ అని ఆయన ప్రశ్నించారు.
రైతులు గత ఏడాది కూడా ఆందోళన చేశారు, ఇప్పుడు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ధన్ ఖడ్ గుర్తుచేశారు. అయితే, ఈ ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానం ఇవ్వలేదు. ఆయన మౌనాన్ని ఎంచుకుని ప్రశ్నలకు స్పందించలేదు.
శివరాజ్ సింగ్ చౌహాన్ గత పదిహేనేళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయనను బీజేపీ హైకమాండ్ కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుని వ్యవసాయ శాఖను అప్పగించిన సంగతి తెలిసిందే.
