భారత ఆటగాడు నితీశ్ రాణాను రాజస్థాన్ రాయల్స్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ.1.50 కోట్లుగా ఉండగా, దాదాపు మూడు రెట్ల ధరకు కొనుగోలు చేయడం విశేషం. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన నితీశ్ రాణా ఇప్పుడు కొత్త ప్రాంచైజీతో ఆడబోతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ జరిగినప్పటికీ చివరకు రాజస్థాన్ అతనిని కొనుగోలు చేసింది.
రాణా కోసం చెన్నై ప్రాథమికంగా బిడ్డింగ్ ప్రారంభించింది. తర్వాత, రాజస్థాన్ రూ.1.60 కోట్లు ఇచ్చి రాణా కోసం పోటీ ప్రారంభించింది. ఈ ధర క్రమంగా రూ.2.20 కోట్లకు చేరుకుంది, ఆ తర్వాత బెంగళూరు కూడా పోటీ పడింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ రూ.4.20 కోట్లతో అతన్ని సొంతం చేసుకుంది.
2016లో ఐపీఎల్ ఆరంగేట్రం చేసిన నితీశ్ రాణా, ఐపీఎల్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు 107 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడిన రాణా 28.34 సగటుతో 2,636 పరుగులు చేశాడు. తక్కువ టైములో వేగంగా బ్యాటింగ్ చేయగలిగిన ఈ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2025 ఐపీఎల్ కోసం కోల్‌కతా అతనిని వదులుకున్నప్పటికీ, అతని పేరు ఫేవరైట్ ఆటగాళ్ల జాబితాలో నిలిచింది.
ఈ ఏడాది ఐపీఎల్ వేలం రెండో రోజు ప్రారంభమైంది. గుజరాత్, పంజాబ్, చెన్నై వంటి ప్రాంచైజీలు తమ అవసరాలకు సరిపోయే ఆటగాళ్లను కొనుగోలు చేస్తూ తమ బలాన్ని పెంచుకుంటున్నాయి. వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్ వంటి ఆటగాళ్లు మంచి ధరలకు అమ్ముడయ్యారు. అయితే, అజింక్యా రహానే, పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఏదైనా ప్రాంచైజీ దృష్టిని ఆకర్షించలేకపోయారు.
