తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు లేకుండా అనేక మదర్సాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పడుతున్న మదర్సాలకు అవసరమైన అధికార అనుమతులు ఉన్నాయా లేదా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు.
జిన్నారం మండలంలోని ఓ మదర్సాపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని, అక్కడ చదువుతున్న 70 మంది విద్యార్థులలో 65 మంది బీహార్ రాష్ట్రానికి చెందిన కిషన్ గంజ్ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు అక్కడ బోధన నిర్వహిస్తున్నారని తెలిపారు. కిషన్ గంజ్ బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉందని, అక్రమ వలసదారులు అక్కడి నుంచి జిన్నారానికి చేరి శిక్షణ పొందుతున్నారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
జిన్నారంలోని కోదండరామస్వామి ఆలయ భూముల్లో మదర్సా ఎలా ఏర్పడిందన్నదానిపై అధికారులు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మదర్సా లాంటి విద్యా సంస్థలు అనుమతులు లేకుండా నిర్వహించడం చట్టవ్యతిరేకమని, ఇది భద్రతాపరంగా ప్రమాదకరమని ఆయన స్పష్టంచేశారు. పోలీస్ అధికారులు లోతుగా దర్యాప్తు జరిపితే మరిన్ని నిజాలు బయట పడతాయని పేర్కొన్నారు.
ఇలాంటి మదర్సాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తామని తెలిపారు. అవసరమైతే ఈ అంశాన్ని గవర్నర్ మరియు కేంద్ర హోంమంత్రికి కూడా తెలియజేస్తామని చెప్పారు. అలాగే తన నియోజకవర్గంలోని ఇస్నాపూర్ ప్రాంతంలో 247 మంది నేపాలీలకు ఆధార్ కార్డులు జారీ కావడాన్ని కూడా ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
