తనపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించడానికి పుల్లారావు కుట్ర పన్నాడని ఆరోపించారు. “నాకు, నా కుటుంబానికి అన్యాయం జరుగుతోంది. పుల్లారావు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కక్ష సాధిస్తున్నాడు” అంటూ విమర్శలు గుప్పించారు.
“పుల్లారావు గుర్తుపెట్టుకో.. నీకూ కుటుంబం ఉంది. ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావు, కానీ రాజకీయాల్లో ఎప్పటికీ ఒకే పరిస్థితి ఉండదు” అంటూ రజిని ఘాటుగా హెచ్చరించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడే అసలైన బహిరంగం ఉంటుందని స్పష్టం చేశారు. అక్రమంగా పెట్టిన కేసులను వదిలే ప్రసక్తే లేదని, వడ్డీతో సహా తీర్చుకుంటామని ఆమె వ్యాఖ్యానించారు.
రాజకీయ కక్ష సాధింపులే కాకుండా, ప్రజాసేవలో ఉండాల్సిన నేతలు వ్యక్తిగత దాడులకు పాల్పడటం బాధకరమని రజిని ఆవేదన వ్యక్తం చేశారు. “మేము ప్రజా నాయకులం, ప్రజల న్యాయం కోసం పోరాడుతాం. కానీ వ్యక్తిగత కక్షలు కోసం వ్యవస్థను ఉపయోగించడం తగదు” అంటూ మండిపడ్డారు.
పుల్లారావు చేస్తున్న అక్రమాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, త్వరలోనే నిజం వెలుగులోకి వస్తుందని రజిని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలను ప్రజలు అర్థం చేసుకుంటారని, తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
