బద్వేల్ మండలంలోని సి కొత్తపల్లి గుడిసవాసులు నీళ్లు, కరెంట్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హాజరై, ఇళ్ల స్థలాలు కోసం నిరుపేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టి, గత పది నెలలుగా పేదలు అక్కడే ఉండిపోతున్నప్పటికీ, వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంటు లేకుండా చిమ్మచీకటిలో ప్రజలను ఉంచడం, తాగునీరు అందించకపోవడం వంటి చర్యలు అధికారం దుర్వినియోగమేనని చంద్ర విమర్శించారు. పేదల కోసం కమ్యూనిస్టు పార్టీ పటిష్టంగా నిలబడుతుందని, మౌలిక సౌకర్యాల విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. పేదల గుడిసెలను కబ్జా చేసే చర్యలకు వ్యతిరేకంగా సిపిఐ ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి. వీరశేఖర్, పట్టణ కార్యదర్శి పి.బాలు, ఏరియా కార్యవర్గ సభ్యులు పెంచలయ్య, ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.
