అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్పీ ఆదేశాలతో నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న నిషేధిత మద్యం, సారాయిని ధ్వంసం చేశారు. రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన 296 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 11,687 మద్యం సీసాలు, 1944.50 లీటర్ల సారాయిని నాశనం చేశారు.
డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, కాకినాడ వారి ఉత్తర్వుల మేరకు ఈ చర్య చేపట్టారు. శ్రీ జి. అమర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అమలాపురం ఆధ్వర్యంలో మద్యం ధ్వంసం ప్రక్రియ పూర్తయింది. జిల్లా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రావులపాలెం టౌన్ సీఐ ఎం. శేఖర్ బాబు, రూరల్ సీఐ చి. విద్యాసాగర్, ఆలమూరు ఎస్‌ఐ కె. అశోక్, ఆత్రేయపురం ఎస్‌ఐ ఎం. రాము, కొత్తపేట ఎస్‌ఐ జి. సురేంద్ర పాల్గొన్నారు. అలాగే, రావులపాలెం రెవెన్యూ అధికారులు కొండేటి సత్యప్రసాద్, చింతపర్తి వెంకటేశ్వరరావు కూడా కార్యక్రమంలో భాగమయ్యారు.
నిషేధిత మద్యం అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. జిల్లాలో నేరాన్ని తగ్గించేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి మరింత గట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
