సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్‌జైల్‌కు తరలించారు. రైల్వే కోడూరు కోర్టులో అర్ధరాత్రి 2:30 గంటల వరకు వాదనలు కొనసాగగా, దాదాపు ఐదుగంటల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్ చివరకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు.
అర్ధరాత్రి నుంచి సాగిన విచారణ అనంతరం తెల్లవారుజామున 5:30 గంటలకు కోర్టు తీర్పును ప్రకటించింది. మార్చి 13 వరకు పోసాని రిమాండ్‌లో ఉండాలని జడ్జి నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే పోలీసు బందోబస్తు నడుమ పోసానిని రాజంపేట సబ్‌జైల్‌కు తరలించారు.
పోసానిపై జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదైన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టులో వాదనలు ఉత్కంఠభరితంగా సాగగా, న్యాయస్థానం చివరకు రిమాండ్ విధించడంతో ఈ కేసు రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది.
రాజంపేట సబ్‌జైల్‌కు తరలించేముందు పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోసాని తరలింపుని ఆసక్తిగా వీక్షించిన అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఈ కేసుపై మరింత ఉత్కంఠ నెలకొంది. రిమాండ్ తర్వాత కేసు మరింత ఏ మలుపు తిరుగుతుందనేది చూడాలి.
