తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్, సుగాలి కాలనీ, వడ్డెర కాలనీ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక కాటన్ సెర్చ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ ఏవి రమణమూర్తి, డీఎస్పీ జనార్దనరావు, 3 టౌన్ సీఐ రమేష్ బాబు నేతృత్వంలో భారీగా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు నేరచరిత్ర ఉన్న వారిని పసిగట్టి విచారణ చేపట్టారు.
ఈ తనిఖీల్లో అనేక మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలను నమోదు చేసి, కొంతమందిని స్టేషన్‌కు తరలించి ప్రశ్నించారు. అలాగే, ఇళ్లలో అనుమానాస్పద వస్తువుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల ఆకస్మిక తనిఖీలతో స్థానిక ప్రజలు కొంత అసౌకర్యానికి గురైనా, భద్రత పరంగా ఇది మంచిదని అభిప్రాయపడ్డారు.
వాహనాల తనిఖీలో భాగంగా సరైన పత్రాలు లేని ద్విచక్ర, మూడు చక్ర, నాలుగు చక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సరైన లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా రహదారిపై ఉన్న వాహనాలను పట్టుకుని దాదాపు 50కు పైగా వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పట్టణంలో శాంతిభద్రతలను మెరుగుపరిచే లక్ష్యంతో తరచూ ఇటువంటి తనిఖీలు జరుగుతాయని పోలీసులు వెల్లడించారు. రౌడీ షీటర్లు, ముఠాల కార్యకలాపాలను అణచివేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులోనూ ఈ తరహా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.