పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 202 మీటర్ల మేర వాల్ నిర్మాణం పూర్తయిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడిన మంత్రి, జగన్ పాలనలో ధ్వంసమైన వాల్‌ను కూటమి ప్రభుత్వం తిరిగి నిర్మిస్తున్నదన్నారు. జనవరి 18న రూ.990 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు.
ప్రస్తుతం రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో పనులు కొనసాగుతున్నాయని, మూడో కట్టర్ కూడా ఏప్రిల్ 30 కల్లా అందుబాటులోకి వస్తుందన్నారు. వర్షాకాలంలోనూ పనులు సాగించేలా ఎగువ కాపర్ డ్యామును బట్రస్ డ్యామ్ రూపంలో మే నెలలో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి డయాఫ్రం వాల్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
డయాఫ్రం వాల్ పూర్తయ్యేలోపు, గ్యాప్-1 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాన్ని ఏప్రిల్ నుంచి ప్రారంభించామన్నారు. అలాగే గ్యాప్-2 వద్ద డ్యాం పనులు నవంబర్ 30లోగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి—అంటే 2027 జూన్ కల్లా ప్రాజెక్టు పూర్తవాలని చంద్రబాబు సూచించారని, ఆ లక్ష్యానికి అనుగుణంగా పనులు సాగిస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వంలో లెఫ్ట్ కెనాల్‌కు అభివృద్ధి లేకపోయినప్పటికీ, కూటమి ప్రభుత్వం రూ.1200 కోట్లతో టెండర్లు పిలిచి వేగంగా పనులు చేస్తోందన్నారు. లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి నీటిని ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి తరలించి, సాగు మరియు తాగునీటి అవసరాలను తీర్చనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.
