సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులపై గోడ కూలిన దుర్ఘటన దేశాన్ని కలచివేసింది. ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, తాను వారి బాధలో భాగస్వామినని పేర్కొన్నారు.
ఈ ఘటనలో మరణించిన భక్తుల కుటుంబాలకు తలసరి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా తోడుంటుందని స్పష్టం చేశారు.
వాస్తవానికి భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం క్యూలో నిలుచుని ఉన్న సమయంలో వర్షం కారణంగా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, వారిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిని విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదం మంగళవారం అర్ధరాత్రి తర్వాత సంభవించింది. భారీ వర్షం కారణంగా సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో టికెట్ కౌంటర్ సమీపంలోని గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో భక్తులు మృతి చెందారు. ప్రమాద స్థలానికి సహాయక బృందాలు చేరుకొని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.
