హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్లాట్ల కొనుగోలుదారులను కొందరు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రెండు వారాల్లో లోతుగా పరిశీలించి ఇరువర్గాల అభిప్రాయాలను వింటామని, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అన్ని విషయాలను విశ్లేషించిన తర్వాత, రెండు నెలల్లో సమస్య పరిష్కారం కావాలని ప్రయత్నిస్తామని వెల్లడించారు.
రంగనాథ్ అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్‌లో గల రాజగోపాల్ నగర్‌ను సందర్శించి, స్థానికులను కలుసుకున్నారు. ప్లాట్లను అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో ఆయన అక్కడికి వెళ్లారు. బాధితుల సమస్యలను స్వయంగా విని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రంగనాథ్, ప్లాట్ల సమస్యపై స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో హైకోర్టు న్యాయవాది ముఖీం జోక్యం చేసుకుని, కమిషనర్‌ను ప్రశ్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. “మీకు తెలుగు వచ్చా?” అని న్యాయవాది ప్రశ్నించగా, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను పరిశీలించడానికి ఎందుకు వచ్చారని నిలదీశారు. రంగనాథ్ దీనికి స్పందిస్తూ, అవసరమైన పరిశీలన జరుగుతుందని, ఓవర్ యాక్షన్ చేయవద్దని న్యాయవాదిని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజగోపాల్ నగర్ ప్లాట్ల వివాదంలో కొన్ని కీలక ఆరోపణలు వచ్చాయి. 40 ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లను కొందరు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. న్యాయవాది ముఖీం, ఎస్సీ, ఎస్టీలను ముందుకు పెట్టి ప్లాట్లను కబ్జా చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అసలు బాధితుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని రంగనాథ్ వెల్లడించారు. ఈ వివాదంపై పూర్తి విచారణ జరిపి, సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.
