అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్నవిమానం ఫుల్లెర్టోన్ పట్టణంలో ఒక కమర్షియల్ భవనం పైకప్పుపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం 2.09 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ప్రమాదం ఫుల్లెర్టోన్ మున్సిపల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో జరిగింది. ఈ ప్రాంతం ప్రఖ్యాత డిస్నీల్యాండ్ పార్క్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఘటనా ప్రాంతంలో భారీ మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల భవనాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది.
విమాన ప్రమాదం జరిగిన భవనం కమర్షియల్ సముదాయమైనప్పటికీ, అది కొంతమేర మాత్రమే దెబ్బతిందని అధికారులు వెల్లడించారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది సమర్థవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం భవనానికి మాత్రమే కాకుండా సమీప ప్రాంతానికి కూడా భయాందోళన కలిగించింది.
విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కూలిపోయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్‌అవేర్’ వివరించింది. ప్రస్తుతం ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుండగా, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.