అరకు నియోజకవర్గంలో తన పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కురుడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించి, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తురాలు రాములమ్మతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గతంలో ‘అడవితల్లి బాట’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారిని గ్రామ గిరిజనులు తమ గ్రామ శివాలయ దర్శనానికి ఆహ్వానించారు. అప్పటి హామీ ప్రకారం ఈసారి స్వయంగా ఆలయానికి వచ్చారు.
అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, గ్రామ అభివృద్ధి నిమిత్తంగా రూ. 5 లక్షలు సొంత నిధుల నుంచి ప్రకటించారు. గ్రామ అవసరాలను ఆలస్యంగా కాకుండా పరిష్కరించేందుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నిస్తానని చెప్పారు.
పర్యాటక శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖల సహకారంతో ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం, టూరిజం అభివృద్ధి ద్వారా గ్రామానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కురుడి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.