మహా కుంభమేళాలో పాక్ హిందువుల పుణ్యస్నానం

68 Pakistani Hindus joined the Maha Kumbh Mela, taking a holy dip at Triveni Sangam and performing special prayers. 68 Pakistani Hindus joined the Maha Kumbh Mela, taking a holy dip at Triveni Sangam and performing special prayers.

యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర మహోత్సవంలో పాల్గొనేందుకు పాకిస్థాన్ నుంచి కూడా 68 మంది హిందువులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. వారు అక్కడ పుణ్యస్నానం చేసి, భగవంతునికి ప్రత్యేక పూజలు చేశారు.

సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఈ హిందువులు, జీవితంలో ఒక్కసారి వచ్చే మహా కుంభమేళా అవకాశాన్ని కోల్పోకూడదని భారత్‌కు వచ్చినట్లు తెలిపారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, ఇక్కడికి రావడం ఎంతో పవిత్రమైన అనుభూతిని కలిగించిందని వెల్లడించారు. హిందూ మతం గొప్పతనాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఈ యాత్ర ద్వారా లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.

అంతేకాక, వారు హరిద్వార్ వెళ్లి తమ పూర్వీకుల అస్థికలను గంగానదిలో కలిపినట్లు తెలిపారు.ఈ కర్మను పూర్తి చేయడం ద్వారా తమ ఆత్మకు తృప్తి లభించిందని చెప్పారు. ఈ పవిత్ర యాత్ర తమ జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. గంగా స్నానం అనంతరం వారు భారతదేశ ఆతిథ్య సంస్కృతిని పొగిడారు.

గత నెల 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. మొత్తం 45 రోజుల పాటు జరిగే ఈ మేళాకు 40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 30 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *