మరో నాలుగు రోజుల్లో ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం పోటీపడనున్నాయి. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా టోర్నీ జరగనుంది. హైవోల్టేజీ మ్యాచ్ అయిన దాయాదుల పోరు ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే అభిమానులలో ఉత్కంఠ నెలకొంది.
భారత జట్టును పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి పంపించేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది. టీమిండియా తన మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనుంది. దీనిపై పాక్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీమిండియాపై గుర్రుగా ఉన్న వారు తమ ఆటగాళ్లకు కీలక సూచనలు అందజేశారు.
మ్యాచ్ సమయంలో టీమిండియా ఆటగాళ్లతో పాకిస్తాన్ క్రికెటర్లు కరచాలనం చేయొద్దని, హగ్ ఇవ్వొద్దని అభిమానులు కోరుతున్నారు. ముఖ్యంగా రిజ్వాన్, కోహ్లీతో స్నేహపూర్వకంగా వ్యవహరించవద్దని సూచించారు. “భారత్ మాతో ఆడటానికి నిరాకరిస్తే, మేము ఎందుకు స్నేహం చేయాలి?” అంటూ అభిప్రాయపడ్డారు. భారత్‌పై గెలిచి తమ మేమెంతో చూపించాలని అన్నారు.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలోనే భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో పాక్ అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకుంది. 2013లో ధోనీ సారథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఈసారి భారత జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారని ఓ అభిమాని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు.
