పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి లష్కరే తోయిబా కీలక నాయకుడు సైఫుల్లా సాజిద్ జుట్ సూత్రధారిగా ఉన్నట్టు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే సైఫుల్లాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అత్యంత ప్రమాదకర తీవ్రవాదిగా గుర్తించి ఉంటుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ, ఆర్మీ ఉన్నతాధికారులతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం సైఫుల్లా ఇస్లామాబాద్‌లోని లష్కరే తోయిబా కేంద్రం నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఆయన పర్యవేక్షణలోనే పహల్గామ్ దాడి జరిగిందని ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. పర్యాటకులపై ఘోరంగా జరిగిన ఈ దాడికి సంబంధించి తాజా ఆధారాలు అతడి పాత్రను స్పష్టంగా చూపుతున్నాయని పేర్కొన్నారు.
దాడి వివరాల్లోకి వెళితే.. కొండ ప్రాంతాల నుంచి వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులను చుట్టుముట్టారు. వారు వారి ఐడీ కార్డులు అడగడం ద్వారా మతాన్ని గుర్తించే ప్రయత్నం చేశారని సమాచారం. ఆపై ముస్లిమేతరులపైనే లక్ష్యంగా చేసుకుని ఐదు నిమిషాల పాటు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిళ్ల బుల్లెట్లు, ఆర్మర్ పియర్సింగ్ బుల్లెట్లు కూడా దొరికాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. అమాయక పర్యాటకులపై జరిగిన ఈ దాడిని భారత సైన్యం తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
