డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫీల్డ్ సిబ్బంది తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 17 ఏళ్లుగా ఈ పథకంలో పనిచేస్తున్న తమకు కనీస స్కేలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ మార్పులు వచ్చినప్పటికీ తమ సమస్యలకు పరిష్కారం లభించలేదని ఫీల్డ్ సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారికి కేడర్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగులకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు.
ఈ నెల 10న జరగాల్సిన కార్యచరణ ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ పిలుపు మేరకు వాయిదా పడిందని వారు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ పరిస్థితిని గుర్తించి, తగిన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, వేతనాలు తక్కువగా ఉండటం తమ కుటుంబాలకు తీవ్ర కష్టాలను తెచ్చిపెడుతున్నాయని చెప్పారు.
ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, అలాగే రిటైర్మెంట్ సందర్భంగా రూ.10 లక్షల బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో తమకు ప్రత్యేక వెయిటేజ్ కల్పించాలని కోరారు.
