తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు చేపడుతూ, గ్రామ రెవెన్యూ అధికారులను తిరిగి నియమించేందుకు అడుగులు వేస్తుంది. ప్రతి గ్రామంలో జూనియర్ రెవెన్యూ అధికారి (JRO) అనే పేరుతో ఒక పోస్టును భర్తీ చేయాలని సర్కార్ భావిస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 10,911 గ్రామాలు ఉన్న నేపథ్యంలో, ప్రతీ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమించాలని నిర్ణయించుకుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి, గతంలో వీఆర్వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)గా పనిచేసి ఇతర శాఖలకు మారిన వారు ఈ అవకాశాన్ని పొందనున్నట్లు తెలుస్తోంది.
భూపరిపాలన ప్రధాన కమిషనర్ సీసీ ఎల్‌ఏ నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, డిగ్రీ అర్హత కలిగిన మాజీ వీఆర్వో, వీఆర్‌ఏలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మిగిలిన 5,300 పోస్టులను భర్తీ చేసే పద్ధతిని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇంటర్ పూర్తి చేసినవారిని, ముఖ్యంగా గణిత శాస్త్రం చదివిన వారిని జూనియర్ రెవెన్యూ అధికారిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.