నిరుపేదలకు గూడు కల్పించాలనే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన అర్హులకే అందాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. న్యాక్‌లో జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇంజనీర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ పథకం కింద ఎవరికీ అన్యాయం జరగకూడదని, ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని అన్నారు.
ఇంజనీర్లకు ఈ బాధ్యత ఉందని పేర్కొన్న మంత్రి, అర్హులను పరిగణించేటప్పుడు అన్ని అంశాలను గమనించాలన్నారు. ‘‘ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకోం, తప్పు జరిగినా సహించం. తప్పు జరిగిందని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా న్యాక్‌లో శిక్షణ పొందిన 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి ఆర్డర్ కాపీలను అందజేశారు. గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తీసుకురావాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లు పథకంపై ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తుందని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అంకితభావంతో పని చేయాలని మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘నిజమైన పేదలకే ఇళ్లు.. ఇంకో మాట లేదు. ప్రతి ఇల్లు న్యాయంగా, అర్హతతో ఇవ్వాలి’’ అని మంత్రి స్పష్టం చేశారు.