ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. 1961 నుండి అమల్లో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టాలను సవరించేందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపింది. త్వరలో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కొత్త చట్టంతో పన్ను వ్యవస్థను మరింత సరళీకరించి, ప్రజలకు సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లులో పలు కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. పన్ను మినహాయింపులు, కొత్త స్లాబ్‌లు, చెల్లింపు విధానాల్లో మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి, ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేలా కొత్త చట్టాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అవకశాలు, అనవసరమైన క్లిష్టతలు తొలగించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందించింది. 1961లో అమలులోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే, పన్ను చెల్లింపుదారులకు మరింత పారదర్శకత, సౌలభ్యత లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే వారం లోక్‌సభలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం ద్వారా మధ్య తరగతి ప్రజలకు మరింత ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
