చైనాలోని శాస్త్రవేత్తలు గబ్బిలాలలో కొత్త కరోనా వైరస్ HKU5-CoV-2ను గుర్తించారు. ఇది కోవిడ్-19తో సారూప్యంగా ఉన్నప్పటికీ, అంత ప్రమాదకరమైనది కాదని పరిశోధకులు తెలిపారు. జంతువుల నుంచి మానవులకు వ్యాపించే అవకాశం ఉందని, దీని మీద మరింత పరిశోధన అవసరమని హెచ్చరించారు. ఈ పరిశోధన హాంకాంగ్‌లోని శాస్త్రవేత్తల బృందం నిర్వహించి, పీర్ రివ్యూడ్ జర్నల్ సెల్లో ప్రచురించారు.
ఈ కొత్త వైరస్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(MERS) వైరస్‌ను కలిగి ఉన్న మెర్బెకోవైరస్ ఉపజాతికి చెందినదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ గబ్బిలాల్లో మొదటిసారిగా ఇది కనుగొనబడింది. ఈ వైరస్ నేరుగా లేదా మధ్యవర్తి జంతువుల ద్వారా మానవులకు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
గ్వాంగ్జౌ లాబొరేటరీ, గ్వాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీ, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. గబ్బిలాలలో కరోనా వైరస్‌లపై విశేష పరిశోధనలు చేసిన బ్యాట్ ఉమెన్‌గా పేరుగాంచిన షీ ఝెంగ్లీ ఈ బృందానికి నాయకత్వం వహించారు. ఈ కొత్త వైరస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్‌లపై భయాందోళనలు పెరుగుతున్నాయి. HKU5-CoV-2 ఇప్పటి వరకు మానవులపై తీవ్రమైన ప్రభావం చూపలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నా, దీని అనుబంధ ప్రభావాలపై నిరంతర పరిశీలన అవసరమని సూచిస్తున్నారు. విస్తృత పరిశోధనలు చేసిన తర్వాతే దీని ప్రమాదకరత గురించి స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
