ముందస్తు రిజర్వేషన్ వ్యవధిలో మార్పులు
రైల్వే టికెట్ల బుకింగ్‌లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. తాజాగా, భారతీయ రైల్వేలు ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని (ARP) 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి (నవంబర్ 1) నుండి అమల్లోకి వచ్చింది. ఈ మార్పుకు సంబంధించి అక్టోబర్ 16న ఒక సర్క్యూలర్ విడుదల చేసి ప్రయాణీకులకు అవగాహన కల్పించారు.
టికెట్ రద్దు మరియు ప్రయాణీకుల ప్రోత్సాహం
రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం, 61 నుంచి 120 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునే టికెట్లలో దాదాపు 21 శాతం టికెట్లు రద్దు అవుతున్నాయి. అదనంగా, మరో 5 శాతం ప్రయాణీకులు కూడా టికెట్లను రద్దు చేయడం లేదా ప్రయాణం చేయడం లేదని గమనించారు. ఈ పరిణామాలను తగ్గించేందుకు ఈ మార్పుని తీసుకొచ్చారు. రద్దీ సీజన్‌లలో ప్రత్యేక రైళ్లను మరింత మెరుగైన ప్రణాళికతో అందుబాటులోకి తీసుకురావడానికి ఇది దోహదపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రస్తుత బుకింగ్‌పై ప్రభావం లేదు
కొత్త నిబంధన అమల్లోకి రావడం ద్వారా రైలు టికెట్లు కేవలం 60 రోజులకు ముందు మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులపై ఈ కొత్త నిబంధన ప్రభావం ఉండదని పీఐబీ వెల్లడించింది. విదేశీ పర్యాటకులకు 365 రోజుల ముందస్తు రిజర్వేషన్ పరిమితిలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని చివరిసారిగా 2015లో సవరించి 60 నుంచి 120 రోజులకు పెంచారు.
