జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ఒకరు. ఆయన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ కుటుంబంతో కలిసి పహల్గామ్‌కి విహారయాత్రకు వెళ్లారు.
అక్కడ బైసరన్ వ్యాలీ సమీపంలోని రిసార్టు వద్ద జరిగిన కాల్పుల్లో మధుసూదన్‌రావు గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే ఆయన కుటుంబసభ్యులు వెంటనే పహల్గామ్‌కి బయలుదేరి వెళ్లారు. మధుసూదన్‌రావు మృతి వార్త విని స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదే ఉగ్రదాడిలో విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి చంద్రమౌళి కూడా మృతి చెందారు. ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిగా గుర్తించారు. ఆయన కూడా కుటుంబ సభ్యులతో కలిసి పర్యటనకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. ఇద్దరి మరణ వార్తలు ఆ కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచేశాయి.
ఈ దాడిపై భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు సైనిక వేషధారణలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడి తీవ్ర భయాందోళనలు రేపింది. ఘటనపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
